కలం, వెబ్ డెస్క్: స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్‌లో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka).. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించి కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాష్ట్రాల ద్రవ్య పెట్టుబడి ప్రత్యేక సహాయం’ స్కీమ్ కింద తెలంగాణకు రూ. 5 వేల కోట్లను అందించాలని కోరారు.
విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి తదితర రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇవి లక్ష్యం చేరుకోవాలంటే కేంద్రం నుంచి సహకారం, ఆర్థిక సాయం అవసరమని నిర్మలా సీతారామన్‌కు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, విద్యారంగంలో మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించీ వివరించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సహా విద్యా రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులకు సంబంధించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించిన విదేశీ ద్రవ్య సహకార ప్రాజెక్టుల గురించి వివరించి ఎఫ్ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని భట్టి కోరారు. డిప్యూటీ సీఎం వెంట తెలంగాణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ గౌరవ ఉప్పల్ తదితరులు ఉన్నారు.

