కలం, తెలంగాణ బ్యూరో : గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పన, అక్కడి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, బ్యాంకులు సైతం గ్రామీణాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) కోరారు. ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్ల మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు పోషించే కీలక పాత్రపైనే గ్రామీణ వికాసం ఆధారపడి ఉంటుందన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో అంచనాలను మించి వృద్ధి సాధ్యమైందని, ఇందులో బ్యాంకుల పాత్ర గణనీయమన్నారు. ఇదే తరహాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు, గ్రామాల్లో మౌలిక వసతులకూ రుణాలు ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతే రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపడుతుందని, ఇందులో బ్యాంకులు చురుకైన పాత్ర పోషించి భాగస్వాములు కావాలన్నారు.
బ్యాంకర్లు కేవలం సాంప్రదాయ పంట రుణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాలన్నారు. దేశవ్యాప్తంగానే ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతున్నదని, వీటికి అవసరమైన రుణాల పంపిణీపైనా బ్యాంకులు దృష్టి సారించాలన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమన్నారు. ఈ అవకాశాన్ని బ్యాంకులు ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి రికార్డు స్థాయిలో 130.78% నమోదైందని, ఇది ఆర్థిక కోణంలో చాలా ప్రధానమైన అంశమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్యాంక్ డిపాజిట్లు రూ. 9.43 లక్షల కోట్లు ఉంటే, రుణాల రూపంలో ఇచ్చిన అడ్వాన్సులు రూ. 12.33 లక్షల కోట్లకు చేరాయని గుర్తుచేశారు. వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, నిర్ణీత లక్ష్యం కంటే ఎక్కువగా 102% ప్రగతిని నమోదు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.
పంట రుణాలతో గ్రామీణ ముఖచిత్రం మారింది
రాష్ట్రంలో పంట రుణాల పంపిణీ రూ. 75,486 కోట్లకు చేరిందని, వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ. 1.68 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు అందజేశాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రుణ సంస్కృతి పునరుద్ధరించబడిందని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో బ్యాంకుల్లో వ్యవసాయ నిరర్ధక ఆస్తులు (మొండి బకాయిలు) 5.23% నుంచి 4.71%కి తగ్గాయన్నారు. ఉద్యానవన రంగంతో పాటు ఆయిల్ పామ్ సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, వీటి విషయంలోనూ బ్యాంకులు సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. పంట నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, సైలోల నిర్మాణానికి బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని దాదాపు వెయ్యి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తగిన ఆర్థిక మద్దతు అందించాలని కోరారు. వీటితో పాటు పర్యావరణ హితమైన సోలార్ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ పద్ధతులకు రుణ సదుపాయాన్ని గణనీయంగా పెంచాలని మంత్రి సూచించారు.

