భద్రాద్రి థర్మల్‌ప్లాంట్ పరిసర గ్రామాలకు ‘బూడిద’ తిప్పలు!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, పరిసర గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ, వెలుగులు నింపాల్సిన ప్లాంట్, చుట్టు పక్కలు గ్రామాల ప్రజల జీవితాల్లో చీకట్లు నింపుతోందని, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మణుగూరు (Manuguru) మండలంలోని సాంబైగూడెం, విజయనగరం, చిక్కుడిగుంట, బయ్యారం గ్రామాల ప్రజలు ప్లాంట్ నుంచి వెలువడుతున్న యాష్ దాటికి విలవిలలాడిపోతున్నారు.

గడిచిన కొన్ని రోజులుగా విద్యుత్ కేంద్రం నుంచి ఎగిసిపడుతున్న బూడిద గాలులు పరిసర గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ఇంట్లోని వంట పాత్రలపైన, ఆరేసిన దుస్తులపైన, చివరకు ఇంట్లోని నిత్యావసర సరుకులపై కూడా బూడిద పొరలు పేరుకు పోతున్నాయి. ఎలా వండాలో, ఎలా తినాలో కూడా అర్థం కావడం లేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలగే గాలిలో కలిసిన ఈ సూక్ష్మ ధూళి కణాల వల్ల వృద్ధులు, చిన్న పిల్లలు శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.

కళ్ళు మండటం, దగ్గు, అలర్జీలు సర్వ సాధారణంగా మారిపోయాయి. బూడిద కప్పేయడంతో గ్రామాల్లోని చెట్లు చేమలు సైతం తెల్లగా మారి పోయాయి. రోడ్లపై వాహనదారులు ప్రయాణించాలంటే కంటి చూపు ఆనక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో లారీ, ఆటో ఎదురెదురుగా ఢీ కొని ఆటో లో ప్రయాణిస్తున్న ఒకరు మరణించడంతో పాటు, ఏడుగురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి.

బీటీపీఎస్ నుంచి వస్తున్న బూడిదకు ప్రధాన కారణం ఏంటి? యాష్ పాండ్ నిర్వహణలో లోపమా? లేక పొగ గొట్టాల ద్వారా వస్తున్న ఉద్గారాల నియంత్రణలో వైఫల్యమా? అన్న ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి. పర్యావరణ నిబంధనలు పక్కన పెట్టి ప్లాంట్ యాజమాన్యం వ్యవహరిస్తుందని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికైనా స్పందించి వెంటనే క్షేత్ర స్థాయిలో గాలి నాణ్యతను పరీక్షించాలని, బూడిద బయటకు రాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చర్యలు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

అభివృద్ధి పేరుతో మా ప్రాణాలను, పంటలను బలి తీసుకోవద్దు. ఎండాకాలం డాబా మీద పడుకుందామంటే, బూడిద ముక్కుల్లోకి వెళ్తుందేమోనని భయం వేస్తుంది. పశువులు, బయట బూడిద పేరుకుపోయిన కాల్వల్లో నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నాయి. పొగాకు పంట వేస్తే ఆకు మీద బూడిద చేరి, దిగుబడి తగ్గి, విపరీత నష్టం వచ్చింది. అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. – చంటి బాబు, సాంబైగూడెం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>