కలం, బోనకల్లు: ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో (Bonakal Gurukul School) అధికారుల నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. పాఠశాల భవనాలు అధ్వానంగా మారడంతో తరగతి గదిలో ప్రశాంతంగా పాఠాలు వింటున్న విద్యార్థులపై ఒక్కసారిగా పైకప్పు స్లాబ్ పెచ్చులూడి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడటంతో గురుకులాల్లో విద్యార్థుల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.
పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా..
బోనకల్లులోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం తరగతి గదిలో విద్యార్థులు పాఠాలు వింటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి కిందపడటంతో 9వ తరగతి చదువుతున్న అద్దంకి కీర్తన (నాగిలిగొండ), చాపలమడుగు పూజిత (చిరునోముల) అనే విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక బాలిక తలకు, మరో బాలిక కాలుకు బలమైన గాయాలు కావడంతో గురుకులంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.
ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అనంతరం 108 అంబులెన్స్‌లో వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తలకు, కాలుకు గాయాలైన ఆ విద్యార్థినులకు వైద్యులు కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు.
ఆరు గదుల్లో గత నాలుగేళ్లుగా ఊడుతున్న పెచ్చులు..
ఈ గురుకుల వసతి గృహంలో మొత్తం 579 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలలోని ఆరు గదుల్లో గత నాలుగేళ్లుగా పైకప్పు పెచ్చులూడుతూనే ఉన్నాయని, ఈ విషయాన్ని పలుమార్లు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనాలు శిథిలావస్థకు చేరినా, వర్షాలకు తడిసి పైకప్పులు బలహీనపడినా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలం చెల్లిన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చదువుకోవాల్సి వస్తోంది.
తల్లిదండ్రుల కన్నీరు.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్..
”పిల్లలను చదువు కోసం గురుకులానికి పంపిస్తే, ప్రభుత్వాలు, అధికారులు కనీస భద్రత కూడా కల్పించలేకపోతున్నారా?” అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, జిల్లాలోని అన్ని గురుకుల, ఆశ్రమ పాఠశాల భవనాలపై సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని, గత నాలుగేళ్లుగా సమస్య ఉన్నా పట్టించుకోని నిర్లక్ష్య అధికారులు, బాధ్యులైన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

