Mobile Popup Ad
Mobile Popup Ad

ఈటీపీఎల్ ప్లేయర్ డ్రాఫ్ట్ పూర్తి.. జట్లలో స్టార్ ఆటగాళ్లు

కలం, స్పోర్ట్స్: యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) తొలి సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. డబ్లిన్‌లో గురువారం జరిగిన తొలి ప్లేయర్ డ్రాఫ్ట్ విజయవంతంగా పూర్తికాగా, ఆరు ఫ్రాంచైజీలు తమ కోర్ జట్లను ఖరారు చేశాయి. మొత్తం 36 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఇందులో క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు (KNCB) నుంచి చెరో 12 మంది చోటు దక్కించుకున్నారు. డ్రాఫ్ట్‌లో ఐర్లాండ్ యువ ఆల్‌రౌండర్ జై మూంద్రా, సీనియర్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న జై మూంద్రాను రోటర్‌డామ్ డాకర్స్ తమ తొలి ఎంపికగా తీసుకుంది. అలాగే మైకేల్ లెవిట్, ర్యాన్ క్లైన్, విక్రమ్‌జిత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్, జాస్పర్ డేవిడ్‌సన్‌లను కూడా జట్టులో చేర్చుకుంది. బెల్‌ఫాస్ట్ వుల్వ్స్ జట్టు అనుభవజ్ఞులైన పాల్ స్టిర్లింగ్, మాథ్యూ హంఫ్రీస్‌ను ఎంపిక చేసింది. మరోవైపు డబ్లిన్ గార్డియన్స్ కెప్టెన్, మెంటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ, జట్టు ఎంపికలో జాతీయత కంటే ఆటగాడి నైపుణ్యం, జట్టుకు ఉపయోగపడే సామర్థ్యానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

ప్రతి ఆటగాడు అవసరమైన సమయంలో జట్టుకు ఉపయోగపడేలా ఎంపిక చేశామని చెప్పారు. రోటర్‌డామ్ డాకర్స్ సహ యజమాని జాంటీ రోడ్స్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్న జై మూంద్రాను తప్పకుండా జట్టులోకి తీసుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌కు చెందిన ప్రతిభావంతులతో సమతూకమైన జట్టును నిర్మించామని చెప్పారు. ఐరిష్ వుల్వ్స్ సహ యజమాని గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా డ్రాఫ్ట్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.

కొత్త జట్టును మొదటి నుంచి నిర్మించడం మంచి అనుభవంగా మారిందని, అవసరమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో జట్టుకు మంచి బలం లభించిందని పేర్కొన్నారు. అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ సహ యజమాని స్టీవ్ వా మాట్లాడుతూ, తొలి ఎంపిక తమదే కావడంతో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

మిగతా జట్ల ఎంపికలను గమనిస్తూ వ్యూహాత్మకంగా ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. రాహుల్ ద్రవిడ్, స్టీవ్ వా, మాథ్యూ హేడెన్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జాంటీ రోడ్స్ వంటి క్రికెట్ దిగ్గజాల మద్దతుతో నిర్వహిస్తున్న ఈటీపీఎల్‌లో జట్లు సిద్ధమయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>