కలం/ఖమ్మం బ్యూరో : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) కలెక్టర్ అంకిత్ అధికారులకు హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో మొట్టమొదటి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం క్రమం తప్పకుండా గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. కాబట్టి అధికారులు తప్పకుండా హాజరవ్వాలని కలెక్టర్ సూచించారు. ఒకవేళ ఎవరైనా హాజరుకాలేకపోతే అందుకు కారణాలు తెలుపుతూ వివరణ ఇవ్వాలని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులోగా చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని కలెక్టర్ అంకిత్ (Collector Ankit) తెలియజేశారు.
Read Also: డిజిటల్ హెల్త్ కార్డు.. ఫోటో, క్యూఆర్ కోడ్
Follow Us On: Instagram

