epaper
Monday, March 2, 2026
epaper

సూర్య కెప్టెన్సీ అదుర్స్.. ఇర్ఫాన్ ప్రశంసలు

కలం, వెబ్​ డెస్క్​: ​టీ20 వరల్డ్​ కప్​లో (T20 World Cup) భాగంగా ఆదివారం కోల్​కతాలో వెస్టిండీస్​తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్​ ఘన విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ప్రేక్షకులను కుర్చీల అంచున కూర్చోబెట్టిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) హీరోగా నిలిచాడు. ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన సంజూ.. ఆఖరి వరకు నిలకడగా రాణించాడు. తాజాగా ఈ మ్యాచ్ వ్యూహాలపై స్పందించిన మాజీ టీమిండియా ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్.. సూర్యకుమార్ (Suryakumar Yadav) కెప్టెన్సీని కొనియాడాడు. సూర్య తన బౌలర్లను ఉపయోగించుకున్న తీరు జట్టును గెలిపించిందని ఆయన ప్రశంసించాడు.

విండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ముందు, మొదటి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సూర్య చాకచక్యంగా వ్యవహరించాడన్నారు. సాధారణంగా బుమ్రాను మొదటి లేదా రెండో ఓవర్‌కే రప్పిస్తారని, కానీ ఈ మ్యాచ్‌లో సూర్య మాత్రం సరైన సమయం కోసం వేచి చూశాడని పఠాన్ (Irfan Pathan) పేర్కొన్నాడు. ప్రమాదకరమైన బ్యాటర్ షిమ్రాన్ హెట్​మెయర్​ క్రీజులోకి వచ్చే వరకు బుమ్రాను హోల్డ్‌లో ఉంచడం మాస్టర్ ప్లాన్ అని ఆయన వివరించాడు.

హెట్​మెయర్​ ఈ టోర్నీలో అప్పటికే 17 సిక్సర్లు బాది భీకర ఫామ్‌లో ఉన్నాడని ఇర్ఫాన్ గుర్తు చేశాడు. అయితే గతంలో బుమ్రా అతడిని ఐదుసార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. అందుకే పవర్‌ప్లేలో ఒక ఓవర్ వేయించిన సూర్య, తిరిగి హెట్​మెయర్​ బ్యాటింగ్‌కు రాగానే బుమ్రాను అటాక్‌లోకి దించాడని చెప్పాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బుమ్రా విండీస్ బ్యాటర్‌ను ఒత్తిడిలోకి నెట్టి, ఔట్​ చేశాడని పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో విశ్లేషించాడు.

సంజూ శాంసన్​ ఫినిషింగ్ టచ్‌తో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, బౌలింగ్ మార్పుల్లో సూర్య(Suryakumar Yadav) చూపిన పరిణతి సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించిందని పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందన్నాడు. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయని క్రీడా పండితులు భావిస్తున్నట్లు చెప్పాడు.

Read Also: మంజుమ్మెల్​ బాయ్స్​ డైరెక్టర్​పై లైంగిక వేధింపుల కేసు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!