కలం, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లా జిల్లా రాంపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని గర్టోలా సమీపంలో హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (HRTC) కి చెందిన ఓ ప్రభుత్వ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో బస్సు కండర్టర్తో సహా ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
రాంపూర్ నుంచి ఖోలీఘాట్ వెళ్తున్న బస్సు గర్టోలా వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోతైన లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిందరినీ చికిత్స నిమిత్తం రాంపూర్‌లోని ఖనేరి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

