క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీలు.. అధికారులపై చర్యలు

​కలం, ఖమ్మం బ్యూరో : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారులనైనా సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) స్పష్టం చేశారు. మంగళవారం దుమ్ముగూడెం మండలంలోని మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, విధుల్లో అశ్రద్ధ చూపిన ఆర్‌ఐపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతో పాటు ఎంపీడీవోకు చార్జ్‌మెమో జారీ చేశారు.

మల్కానపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పరిశీలన కోసం కలెక్టర్ అడవి ప్రాంతం గుండా సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. క్షేత్రస్థాయిలో సర్వే పురోగతి, సరిహద్దుల నిర్ధారణపై అధికారులను విచారించారు. సర్వే పరిధిలోని 120 మంది ఎంజాయర్ల వివరాలు, పాసుపుస్తకాల స్థితిపై సంబంధిత ఆర్‌ఐ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పాత రికార్డులు-మ్యాప్‌లను పరిశీలించి భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు.

మండలంలోని 8 గ్రామాల్లో చేపట్టిన సర్వేలో ఇప్పటివరకు 5 గ్రామాల సరిహద్దుల నిర్ధారణ పూర్తయిందని తెలిపారు. ​అనంతరం మల్కానపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ (Ankit) పరిశీలించారు.  గుడిసెల సర్వే వివరాలు సరిగ్గా అందించలేకపోయిన ఎంపీడీవో వివేక్ చంద్రకు చార్జ్‌మెమో జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

​చివరగా చిన్నబండిరేవు గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, క్రీడలు అందుబాటులోకి తెచ్చేలా క్యాంపస్‌ను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ప్రజాసేవే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ అశోక్ కుమార్ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>