కలం, వరంగల్ బ్యూరో : అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం(World Anti Corruption Day) సందర్భంగా హనుమకొండలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. జ్వాలా స్వచ్ఛంద సేవా సంస్థ, లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం బిచ్చగాళ్లలో ర్యాలీ (Beggars Rally) తీశారు. లంచగొండి, అవినీతి పరులకంటే బిచ్చగాళ్లే నయమంటూ ఫ్లెక్లీలు ప్రదర్శించారు. వేయిస్తంభాల దేవాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. రోజు రోజుకు రాష్ట్రంలో, దేశంలో అవినీతి పెరుగుతోందని…లంచగొండి అధికారుల్లో మార్పురావాలని నిర్వాహకుడు సుంకరి ప్రశాంత్ అన్నారు. అవినీతి పరుల్లో మార్పు కోసమే బిచ్చగాళ్లతో ర్యాలీ నిర్వహించామని, అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ ర్యాలీ నిర్వహించడం ద్వారా అవినీతిపరుల కంటే బిచ్చగాళ్లే నయం అని నిర్వాహకులు చెప్పదలుచుకున్నారు. దీన్ని చూసైనా లంచం తీసుకునే అధికారులు మారాలని కోరుతున్నారు.
ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నా కొందరు అవినీతి అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. పైసా విధిలిస్తేనే పని చేస్తామంటూ కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. అవినీతిని అడ్డుకోవాలని ఏసీబీ అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వేలసంఖ్యలో లంచగొండి అధికారులను పట్టుకుంటున్నారు. అయినా, కొందరిలో మార్పు రావడం లేదు. అటెండర్ నుంచి అడిషనల్ కలెక్టర్ దాకా పైసల కోసం కక్కుర్తి పడి ప్రజల నుంచి లంచం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే వరంగల్ లోని జ్వాలా స్వచ్ఛంద సేవా సంస్థ, లోక్ సత్తా ఉద్యమ సంస్థ సంయుక్తంగా బిచ్చగాళ్లతో ర్యాలీ (Beggars Rally) చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించింది. ఈ కార్యక్రమం పలువురిని ఆలోచింపజేస్తున్నదని నిర్వహకులు చెబుతున్నారు.
Read Also: సీఎం స్నేహితుడి పేరుతో బెదిరింపులు, మహిళకు రూ. 20 లక్షల టోకరా
Follow Us On: X(Twitter)


