కలం, ఖమ్మం బ్యూరో: ఎండ వేడిమి తునికాకు (బీడీ ఆకు) సేకరణపై తీవ్ర ప్రభావం చూపడంతో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో వరుసగా రెండో ఏడాది కూడా సేకరణ లక్ష్యం నెరవేరలేదు. మే 31వ తేదీతో ఈ సీజన్ గడువు ముగిసింది. జిల్లాలోని ఆరు అటవీ డివిజన్ల పరిధిలో ఈ ఏడాది మొత్తం 32,690 స్టాండర్డ్ బ్యాగుల సేకరణను అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 14,419 బ్యాగులు మాత్రమే సేకరించగలిగారు. గతేడాది 35,300 బ్యాగుల లక్ష్యానికి గాను కేవలం 10,361 బ్యాగులు మాత్రమే సేకరించారు. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో కూలీలు అడవుల్లోకి వెళ్లి ఆకు సేకరించలేకపోయారు. దీనికి తోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు లభించడంతో కూలీలు స్థానికంగానే పనులకు మొగ్గు చూపారు. ఈ రెండు ప్రధాన కారణాలతో తునికాకు సేకరణ లక్ష్యం ఈసారి నెరవేరలేదని అధికారులు చెబుతున్నారు.

