టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే!

కలం, స్పోర్ట్స్ : టీమిండియా స్పిన్ విభాగానికి కొత్త బాస్ వచ్చారు! భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ అంతర్జాతీయ ఆటగాడు సాయిరాజ్ బహుతులే (Sairaj Bahutule) నియమితులయ్యారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాయిరాజ్ బహుతులేకు ఆటగాడిగా, కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో ఆయన భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడారు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో దాదాపు ఇరవై ఏళ్ల పాటు స్టార్ ఆల్‌రౌండర్‌గా దుమ్మురేపారు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఏకంగా 6,176 పరుగులు చేయడమే కాకుండా, 630 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటారు.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక బహుతులే సక్సెస్‌ఫుల్ కోచ్‌గా మారారు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ జట్లకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు స్పిన్ కోచ్‌గా సేవలందించారు. 2021 నుండి 2024 వరకు బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. 2022లో ప్రపంచకప్ గెలిచిన భారత అండర్-19 జట్టుకు, అలాగే 2024 అండర్-19 జట్టుకు ఆయనే బౌలింగ్ కోచ్. గతంలో ఇండియా-ఎ, సీనియర్ జట్లకు కూడా స్పెషలిస్ట్ కోచ్‌గా వ్యవహరించారు.

ఈ నియామకంపై సాయిరాజ్ బహుతులే స్పందించారు. టీమిండియాకు స్పిన్ కోచ్‌గా ఎంపికవ్వడం తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని పేర్కొన్నారు. గతంలో దేశం తరఫున ఆడడం ఎంతో గర్వాన్ని ఇచ్చిందని, ఇప్పుడు కోచ్‌గా మళ్లీ సేవ చేసే అవకాశం రావడం చాలా ప్రత్యేకమని చెప్పారు. అన్ని ఫార్మాట్లలో జట్టును అగ్రస్థానంలో నిలిపేందుకు ఆటగాళ్లతో కలిసి శ్రమిస్తానని వెల్లడించారు. క్రికెట్ ప్రపంచంలో మంచి గుర్తింపు ఉన్న బహుతులే రాకతో భారత స్పిన్ బౌలింగ్ మరింత బలోపేతం అవుతుందని, ముఖ్యంగా యువ స్పిన్నర్ల ప్రతిభకు ఈయన అనుభవం ఎంతగానో ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>