కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం.. ఏలేటి సంచలన ఆరోపణలు

కలం, వెబ్ డెస్క్: నీళ్లు, నిధులు, నియామకాలతో సాధించుకున్న తెలంగాణను గత పదేళ్లు బీఆర్ఎస్ ఎలా విస్మరించిందో, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే విస్మరిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని నాంపల్లి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రెండు పార్టీల నేతలు కలిసి రాష్ట్రంలో జగన్నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఒకరికేమో ధనదాహం, మరొకరికేమో అధికార దాహం ఉందని మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తూ కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో అధికారం పోయిన బాధ మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఈ కుమ్ములాటలు, రాజకీయాలు, నాటాకాలు ఒకరు అధికార దాహంతో, ఒకరు అవినీతి మొహంతో చేస్తున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ సర్కార్..

రేవంత్ సర్కార్ రాష్ట్రంలో అనేక వర్గాలకు సంబంధించిన బకాయిలు పెండింగ్ లో పెట్టిందని ఏలేటి ధ్వజమెత్తారు. సింగరేణి సంస్థ కార్మికులకు రూ. 54 వేల కోట్ల బకాయిలున్నాయని.. వెంటనే బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు కూడా విడుదల చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని.. కేవలం రెండున్నరేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మండిపడ్డారు.

బిల్లులు రిలీజ్ చేయాలి..

కేటీఆర్ ఆనాడు నిరుద్యోగుల పట్ల అహంకారంగా వ్యవహరించారని.. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఏలేటి మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేర్చడం లేదన్నారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వేంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ సతాయిస్తోందని విమర్శించారు. వెంటనే బిల్లులు రిలీజ్ చేయాలన్నారు.

దేనికోసం సభ కేటీఆర్?

యువతను పట్టించుకోకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో యువతకు న్యాయం చేస్తామంటూ కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. నాడు యూత్ డిక్లరేషన్ ఇచ్చారని.. నేడు యువ సంగ్రామ సభ పెడుతున్నారని విమర్శించారు. దేనికోసం యువ సంగ్రామ సభ కేటీఆర్? అంటూ ప్రశ్నించారు. మీ హయాంలో యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా? అని నిలదీశారు.

రేవంత్ ఔరంగజేబులా.. కేటీఆర్ ఆదిల్ షాలా..

యువతను బీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీలు మోసం చేశాయని మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. నిరుద్యోగంపై మాట్లాడే అర్హత కేటీఆర్, రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఇద్దరి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఔరంగజేబులా.. కేటీఆర్ ఆదిల్ షాలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓడించేందుకు ఛత్రపతి శివాజీలా ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పారు.

Read Also: బీసీ ప్లాన్: కమలం పార్టీ కొత్త వ్యూహం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>