కలం, వెబ్‌డెస్క్: శంషాబాద్ సమీపంలోని బహదూర్‌గూడ (Bahadurguda)లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూ సేకరణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని శనివారం దీక్షకు దిగిన రైతులు పోలీసులపై దాడి చేశారు. దీంతో పోలీసులపై దాడి చేసిన రైతులపై నేడు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులపై రాళ్లు, కుర్చీలు, కారం పొడితో దాడి చేశారని ఎస్సై వనజ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలువురు రైతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం ప్రకారం 132, 308(2) 121(1), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.
మరోవైపు బహదూర్‌గూడాలో ప్రభుత్వం సేకరించతలపెట్టిన 650 ఎకరాలకు ఫెన్సింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి హైడ్రా రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించింది. రైతులను అక్కడి నుంచి బలవంతంగా వెళ్లగొట్టి దీక్షా శిబిరం దగ్గర ఫెన్సింగ్ వేశారు. బహదూర్‌గూడా ప్రస్తుతం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా చుట్టూ పోలీసుల పహారా కాస్తున్నారు.
గ్రామస్తులు మాత్రం తమకు మార్కెట్ విలువకు తగ్గ పరిహారం లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఇదే సమయంలో నేడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బహదూర్‌గూడకు చేరుకున్నారు. గ్రామస్తులు భారీ ఎత్తున తరలివచ్చి ఆమెకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు ఇప్పటికే అన్యాయం చేస్తున్నారని చెప్పారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.
Read Also: ఢిల్లీలో అఖిలపక్ష భేటీ.. విపక్ష పార్టీల వాకౌట్.. ఏమైందంటే?
Follow Us On : WhatsApp

