కలం, ఖమ్మం బ్యూరో: ఏ అమరవీరుల రక్తాంజలితో, ఏ త్యాగధనుల ప్రాణాల పునాదుల మీద తెలంగాణ (Telangana) రాష్ట్రం ఆవిర్భవించిందో.. అదే అమరులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ ఘోర అవమానం జరిగింది. జూన్ 2వ తేదీన యావత్ తెలంగాణ సమాజం పండుగ చేసుకుంటుంటే ఖమ్మం (Khammam) నగర నడిబొడ్డున ఉన్న అమరవీరుల స్థూపం మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో చీకట్లలో మగ్గిపోయింది. పాలకుల ఉదాసీనతకు, యంత్రాంగం నిర్లక్ష్య ధోరణికి ఈ దృశ్యం అద్దం పడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా అధికారిక వేడుకలు ఆర్భాటంగా జరుగుతున్నప్పటికీ, ఖమ్మం ప్రధాన కూడలిలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు. కనీసం విద్యుత్ దీపాలతో కూడా అలంకరణ చేయకపోవడంతో రాత్రి వేళ ఆ పవిత్ర స్మారకం చీకట్లో ఉండిపోయింది. స్వరాష్ట్రం సిద్ధించిన రోజు, అమరుల స్మారకం వద్ద కనీసం ఒక దీపం వెలిగించే నాథుడు కరువవడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. అమరవీరుల స్థూపం పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమరవీరుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బాధ్యులైన అధికారులపై ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలిచ్చిన వీరులకు ఇలాంటి అవమానం జరగకుండా చూడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే తప్పును సరిదిద్దుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.

