కలం వెబ్ డెస్క్ : అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న బంగ్లాదేశ్ క్రికెటర్ల వార్నింగ్‌తో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(BCB) కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎం.నజ్ముల్ ఇస్లాం(Nazmul Islam)పై వేటు వేసింది. అతనని పదవి నుంచి తక్షణమే తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో గురువారం జరగాల్సిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. BCB రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. కార్యకలాపాలు సజావుగా సాగాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫైనాన్స్ కమిటీ బాధ్యతలను BCB అధ్యక్షుడు మొహమ్మద్ అమీనుల్ ఇస్లాం స్వయంగా నిర్వహించనున్నారు. క్రికెటర్ల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని BCB మరోసారి స్పష్టం చేసింది. ఆటగాళ్ల గౌరవం, ప్రతిష్ఠ కాపాడటమే తమ లక్ష్యమని తెలిపింది. అదే సమయంలో వృత్తిపరమైన దృక్పథంతో BPLలో పాల్గొనాలని క్రికెటర్లకు విజ్ఞప్తి చేసింది.
నజ్ముల్ ఇస్లాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ పరిణామాలకు మూలకారణం. 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు బంగ్లాదేశ్ హాజరుకాకపోతే బోర్డుకు ఆర్థిక నష్టం ఉండదని, ఆటగాళ్లకు ఎలాంటి పరిహారం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు క్రికెటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. ఇదే సమయంలో మాజీ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్‌ను “భారత ఏజెంట్”గా పేర్కొంటూ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ వివాదం గురువారం తీవ్ర స్థాయికి చేరింది. చటోగ్రామ్ రాయల్స్, నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందుగా ఏ జట్టూ మైదానానికి రాలేదు. ఫలితంగా ఆ రోజు షెడ్యూల్ చేసిన రెండు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (CWAB) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.


