కలం, నిర్మల్: బీసీల హక్కుల సాధన కోసం వచ్చే నెల డిసెంబర్ 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న బీసీల జనభేరి (BC Janabheri Sabha) సభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను (Posters) విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు చట్టసభల్లోనూ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలంతా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమ నేత తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అమరవేణి నర్సాగౌడ్, నాయకులు మనోజ్ యాదవ్, సుదర్శన్, యాటకారి సాయన్న తదితరులు పాల్గొన్నారు.

