కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో 9వ, 10వ తరగతులు చదువుతున్న బీసీ (BC), ఈబీసీ (EBC) విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ (Pre Matric Scholarship) కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయి కుమార్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎంపికైన విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ తరఫున రూ.4,000/- ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంకు పాస్‌బుక్ కాపీ, బోనాఫైడ్ సర్టిఫికెట్‌తో సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

