Mobile Popup Ad
Mobile Popup Ad

మనం తింటున్నది ఆహారమా.. విషమా?

కలం , నేషనల్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు.. మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమని భావించి నిషేధించిన అత్యంత ప్రమాదకరమైన పురుగుమందులు (Pesticides), కలుపు సంహారకాలు ఇండియాలో ఇప్పటికీ స్వేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఒకప్పుడు యూరప్, అమెరికాలో తయారు చేసిన ఈ రసాయనాలు.. నేడు ఇండియాలోని పొలాల ద్వారా నేరుగా మన ప్లేట్లలోకి.. ఆ తర్వాత మన శరీరాల్లోకి చేరుతూ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని పర్యావరణ, ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మన ఆహార ఉత్పత్తులపై యూరప్‌లో నిషేధం

యూరోపియన్ యూనియన్.. ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్‌గా మారాయి. యూరోపియన్ కమిషన్, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ప్రకారం.. 2024 మే నుంచి 2026 మే మధ్య ఇండియా నుంచి ఎగుమతి అయిన 365 ఆహార ఉత్పత్తులను ఐరోపా దేశాలు తిరస్కరించాయి. వాటిలో ఉండాల్సినదానికంటే ఎక్కువ మోతాదులో ప్రమాదకర పురుగుమందులు, లోహాల అవశేషాలు ఉండటమే ఇందుకు కారణం. తమ దేశ ప్రజల ఆరోగ్యం కోసం యూరప్ దేశాలు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేస్తుంటే.. ఇండియాలో మాత్రం కోట్లాది మంది ప్రజలు రోజువారీ తినే ఆహార భద్రత గాల్లో దీపంగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

పారాక్వాట్

1882లో కనుగొన్న పారాక్వాట్.. 2007లోనే ఈయూ నిషేధించింది. ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో దీనిపై బ్యాన్ ఉంది. కానీ ఇండియాలో దీనికి భారీ మార్కెట్ ఉంది. ఇది శరీరంలోకి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే ప్రాణం తీస్తుంది. దీనికి విరుగుడు లేదు. ఇది ఊపిరితిత్తులు, కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది.

గ్లైఫోసేట్

ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న గ్లైఫోసేట్.. 2015లోనే డబ్ల్యూహెచ్వోకు చెందిన ఐఏఆర్‌సీ.. క్యాన్సర్ కారక కెమికల్గా ప్రకటించింది. అమెరికాలో నమోదైన కేసుల పరిష్కారానికి దీని మాతృ సంస్థ బేయర్ బాధితులకు వందల కోట్ల పరిహారం చెల్లించింది. ఇండియాలో మాత్రం సురక్షితమైనదిగా ప్రచారం చేస్తూ కోట్ల రూపాయల దండుకుంటున్నారు.

2, 4 డీ

వియత్నాం యుద్ధ సమయంలో అడవులు, పంటలు నాశనం చేయడానికి అమెరికా సైన్యం వాడిన ఏజెంట్ ఆరెంజ్ లోని కెమికలే.. 2,4-D. భారతదేశంలో వరి, గోధుమలు, మొక్కజొన్న, చెరకు పంటలలో కలుపు నివారణకు దీనిని చాలా నార్మల్గా వాడుతున్నారు. ఇది వాడితే క్యాన్సర్ బారినపడతారని ఐఏఆర్సీ హెచ్చరించింది.

డైమెథోయేట్, అసిఫేట్

డీఎన్ఏ వ్యవస్థను డైమెథోయేట్ దెబ్బతీస్తుంది. ఈ కారణంతో 31 దేశాలు దీనిని నిషేధించినప్పటికీ భారతదేశంలో విక్రయాలు సాగుతున్నాయి. అసిఫేట్.. పత్తి, కూరగాయలపై వాడుతున్నారు. ఇది పంటల పరాగసంపర్కానికి తోడ్పడే తేనెటీగలు, సీతాకోకచిలుకల ఉనికిని దెబ్బతీస్తున్నది. తేనెటీగల జనాభా తగ్గితే పండ్లు, కూరగాయలు, నూనెగింజల దిగుబడి పడిపోయే ప్రమాదం ఉంది.

పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. భారతదేశంలో 2022లో సుమారు 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య 2025 నాటికి సుమారు 15.7 లక్షలకు చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. ఆహారం, నీరు, మట్టి ద్వారా శరీరంలోకి చేరే ఈ రసాయనాల అవశేషాల పాత్ర ఇందులో కీలకమని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సమస్య ఎక్కడ ఉంది?

పురుగుమందులు లేకపోతే ఆధునిక వ్యవసాయం సాగదని.. వీటిని నిషేధిస్తే పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారని వాదిస్తున్నారు. కానీ, విదేశాలు సరికొత్త పరిశోధనల ఆధారంగా ఎప్పటికప్పుడు ప్రమాదకర రసాయనాలను నిషేధిస్తుంటే.. ఇండియాలో మాత్రం దీనిపై రివ్యూలు చేస్తున్నారు. రైతులు కూడా తక్కువ పెట్టుబడి ఖర్చుల కోసం పాత తరం, చౌకైన పురుగుమందులపైనే ఆధారపడుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>