కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా హాట్ టాపిక్‌గా మారింది. అన్ని ప్రధాన పార్టీల రాష్ట్రస్థాయి నేతలు వరంగల్ పైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొద్ది రోజులుగా వరుసగా రాజకీయ సభలు, సమావేశాల పేరిట క్యూ కడుతున్నారు. జిల్లాలో ఆయా పార్టీల నేతలు పర్యటిస్తూ రాజకీయ వేడిని హీటెక్కిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS)తో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు వరంగల్ పై ఫోకస్ చేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు (Warangal Politics) చర్చనీయాంశంగా మారాయి.
క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు..
భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో వారం కింద మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటములతో కొంత నిరుత్సాహానికి గురైన క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరంగల్ పర్యటన వ్యక్తిగతమే అయినప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తన అభిమాని కోరిక తీర్చేందుకు పవన్ హనుమకొండకు వచ్చారు. ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయితే యువతలో పవన్ కు ఉన్న ఆదరణతో పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) జెండా పండుగ కార్యక్రమాల పేరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలను కలుస్తూ పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నారు. గత శనివారం ఆమె భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో పార్టీ జెండా పండుగల్లో పాల్గొన్నారు.
సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వరుసగా వరంగల్ లో పర్యటిస్తున్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నారు. హనుమకొండలోని గుండ్ల సింగారంలో శనివారం పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ యంత్రాంగం కూల్చివేసింది. ఈ మేరకు ఆయన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వరంగల్‌కు రానుండగా, ఆయన పర్యటనపైనా పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పార్టీ అంతర్గత విభేదాలు, నాయకత్వ పోటీలు నెలకొన్నందున కేటీఆర్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదే రోజు అధికార కాంగ్రెస్ (Congress) కూడా వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, రైతు హామీలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటన ఉండనుంది.
వరంగల్ పైనే అన్నిపార్టీల చూపు
రాజకీయ చైతన్యానికి కేంద్రంగా నిలిచే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటర్ల తీర్పు తరచూ రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపింది. అందుకే ఏ పార్టీ అయినా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. అంతేకాదు, ప్రస్తుతం జిల్లాలో అనేక రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్లో కొత్త నాయకత్వం ఎదుగుతున్నది. కాంగ్రెస్‌లో అధికారంతో పాటు అంతర్గత పోటీలు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ వరంగల్‌లో తమ ఉనికిని బలంగా చాటుకోవాలని చూస్తున్నది. రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
స్థానిక ఎన్నికలే లక్ష్యమా?
నేతల వరుస పర్యటనల వెనుక స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, సహకార సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీలు క్యాడర్‌ను సమీకరిస్తున్నాయి. నేతలు ప్రజల్లోకి వెళ్లడం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి విషయాల ద్వారా రాజకీయ పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే వరంగల్‌లో జరుగుతున్న రాజకీయ నేతల పర్యటనల వరకే పరిమితం కావడం లేదు. రాబోయే ఎన్నికల రాజకీయాలకు, పార్టీల భవిష్యత్ వ్యూహాలకు ఇవి నాంది పలుకుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీల నేతలు.. పర్యటనలు
సర్ పై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి అలర్ట్ గా ఉండాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. బీఆర్ఎస్ లో అసమ్మతి వర్గాలను తన వైపు తిప్పుకొని రాజకీయంగా ముందుకు వెళ్లాలని కవిత భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో వ్యూహాలు అమలుకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి, నాయకత్వ సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

