కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సోమవారం ( జూన్ 22) హాజరు కావాలని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆన్ లైన్ లో హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు కోర్టు అనుమతి నిరాకరించింది. అల్లు అర్జున్‌తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరో 19 మందికి సమన్లు పంపింది. దీంతో ఈ కేసులో నేడు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ కోర్టు నేడు విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారా? లేదా క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా? అనేది ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో సర్వాత్రా ఆసక్తి రేపుతోంది.
కాగా, ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ దురదృష్టకర తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగి 39 ఏళ్ల రేవతి అనే మహిళ మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన ఛార్జ్‌షీట్‌లో పోలీసులు అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే అనంతరం తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

