కలం, వెబ్ డెస్క్ : బ్యాంకు ఉద్యోగుల ప్రతినిధులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె (Bank Strike)కు పిలుపునిచ్చింది. డిప్యూటీ లేబర్ కమిషనర్‌తో జరిపిన చర్చలలో స్పష్టమైన హామీ లభించకపోవడంతో యూనియన్లు సమ్మె దిశగానే అడుగులు వేస్తున్నాయి.
ఈ సమ్మెకు ముందు సెప్టెంబర్ 26 రెండవ శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం కావడం వల్ల సాధారణ సెలవులు ఉంటాయి. దీనివల్ల సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు నేరుగా బ్యాంకింగ్ లావాదేవీలకు విఘాతం ఏర్పడనుంది. చివరి తేదీలలో నెలాఖరు లావాదేవీలు చెక్కుల క్లియరెన్స్ వంటి పనులపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, వినియోగదారులు తమ ముఖ్యమైన ఆర్థిక పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

