కలం, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడు (Julurupadu) మండలంలో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక ఆమె విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి(18) అనే యువతి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. హరిణి తండ్రి గతంలోనే మరణించడంతో, తల్లి రాజేశ్వరి కూలి పనులు చేస్తూ తన ఇద్దరు కూమార్తెలను చదివిస్తోంది. ఇటీవల కళాశాలకు సెలవులు ఇవ్వడంతో హరిణి ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలో తల్లి రాజేశ్వరి అదే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి వచ్చేసరికి హరిణి ఇంట్లో కనిపించలేదు. ఆందోళన చెందిన తల్లి స్థానికులతో కలిసి ఆమె కోసం వెతికింది. ఈ క్రమంలో ఒంటిపై గాయాలతో, బాత్రూమ్ సమీపంలో పడి ఉన్న హరిణి మృతదేహాన్ని వారు గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

