కలం, వెబ్ డెస్క్: ఏ బ్యాంకైనా రుణంగా డబ్బు ఇస్తుంది. కానీ మహారాష్ట్రలోని ఓ బ్యాంక్ మాత్రం మేకలను ఇస్తుంది. నగదు బదులు మేకల (Goats) లావాదేవీలు చేస్తూ మహిళలకు వరంగా మారుతోంది. మహారాష్ట్ర జల్గావ్ సమీపంలోని చాలీస్గావ్‌లో ‘గోట్ బ్యాంక్’ మహిళల సంక్షేమానికి పాటుపడుతోంది. 300 మందికిపైగా పేద వితంతువులు, భూమిలేని భూమిలేని మహిళకు మేకలను పంపిణీ చేసింది. దీని ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. ఈ మేకల బ్యాంకును పూణేలోని సేవా సహయోగ్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది.
ఈ రకమైన రుణం తీసుకోవడానికి వచ్చే మహిళలకు వ్యవసాయం, పశుపోషణలో శిక్షణ ఇస్తుంది. ఆ తర్వాత మేకను ఉచితంగా ఇస్తారు. కానీ ఓ కండీషన్ పెట్టింది. 6 నుంచి 9 నెలల తర్వాత మేకకు పిల్లలు పుడితే, అందులో ఒకదాన్ని బ్యాంకుకు డిపాజిట్‌గా తిరిగి ఇవ్వాలి. అది పెద్దయ్యాక, స్వయం ఉపాధి కోసం మరొక కొత్త సభ్యురాలికి బ్యాంక్ అధికారులు (Bank Officers) ఇస్తారు. ఇది మహిళలకు ఏటీఎంగా మారింది.
మహిళలు (Women) బ్యాంకు నుంచి పొందిన మేకలను పెంచుతున్నారు. ఏడాది 3 నుంచి 4 పిల్లలను పొందుతున్నారు. ఒక పిల్లను బ్యాంకుకు తిరిగి ఇస్తే, మిగిలిన వాటిని అమ్మడం ద్వారా రూ. 30,000 వరకు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ మహిళలు కలిసి ‘గిర్నా పరిసార్ మహిళా పశుపాలక్ ఉత్పాదక్ కంపెనీ’ ను స్థాపించి లాభాలు పొందుతున్నారు.


