కలం, వెబ్ డెస్క్: టీ-20 వరల్డ్ కప్ పోటీ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశంలో వరసగా హిందువులపై దాడులు జరగడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ప్రభావం క్రికెట్ మీద కూడా పడుతోంది. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) (Bangladesh Cricket Board) రేపటి ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం భారతదేశానికి తమ జట్టును పంపొద్దని నిర్ణయం తీసుకున్నది. ఆదివారం నిర్వహించిన డైరెక్టర్స్ మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ను బీసీబీ సంప్రదించింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారతదేశం నుండి శ్రీలంకకు మార్చాలని కోరింది. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజురు రహ్మాన్‌ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా, కేకేఆర్ ఫ్రాంచైజీ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయమని బీసీసీఐ సూచించింది. ఆ స్థానంలో మరో ఆటగాడిని నియమించుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది.
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తన తొలిమ్యాచ్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంది. వెస్టిండీస్‌తో మ్యాచ్ అనంతరం ఫిబ్రవరి 9న ఇటలీతో అదే వేదికలో మ్యాచ్ ఆడుతుంది. ఆ తరువాత, ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో మ్యాచ్ ఉంది. ఇంగ్లండ్ మ్యాచ్ తరువాత బంగ్లాదేశ్ జట్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 7న కొలంబోలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరగనున్నది. మరి బంగ్లాదేశ్ నిర్ణయంతో ఆ దేశ జట్టు ఆడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.


