కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్‌లో కేంద్ర పారా మిలటరీ బలగాలకు సంబంధించి గ్రూప్ సెంటర్‌ను ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) ఆమోదం తెలిపింది. గ్రూప్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేస్తున్న యత్నాలు కొలిక్కి వచ్చాయి. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంబంధిత విభాగాల డీజీపీలతో ఇటీవల చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే గ్రూప్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని ఆయా డీజీపీలు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న బండి సంజయ్ కుమార్ గత మార్చి 10న కేంద్ర పారా మిలటరీ బలగాల గ్రూప్ సెంటర్ కోసం కరీంనగర్ లో తగిన స్థలం కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
‘‘కరీంనగర్‌లో అస్సాం రైఫిల్స్, BSF, CISF కోసం ఒక “గ్రూప్ సెంటర్” ఏర్పాటు చేయాలనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి అన్ని విభాగాల డైరెక్టర్ జనరల్స్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే CAPFs (కేంద్ర సాయుధ పోలీసు బలగాలు) మరియు అస్సాం రైఫిల్స్ తదుపరి చర్యలు తీసుకుంటాయి’’ అని ఆ లేఖలో పేర్కొననారు. కేంద్ర మంత్రి లేఖకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను సీసీఎల్ఏ కు పంపారు. పరిశీలించిన సీసీఎల్ఏ ఆయా ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ కు పంపింది. ఈరోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మానకొండూరులోని వెల్దిలో 4 ఎకరాలు, చొప్పదండిలోని రుక్మాపూర్ లో 5 ఎకరాలు గన్నేరువరంలో 5 ఎకరాలు వెరసి మొత్తం 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో పారామిలటరీ బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటుపై మరో అడుగు ముందుకు పడ్డట్లయింది. త్వరలోనే కేంద్రం గ్రూప్ సెంటర్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది.

