Mobile Popup Ad
Mobile Popup Ad

గోదాములను నగరానికి దూరంగా తరలించాలి: సునీల్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌ (Karimnagar) లోని గోదాంగడ్డ ప్రాంతంలోని గిడ్డంగుల (వేర్ హౌజ్) కేంద్రాన్ని బుధవారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) సందర్శించారు. వేర్ హౌజ్ అధికారులు సిబ్బందితో కలిసి గోదాముల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గోదాములలో ఉన్న ప్యాడీ (ధాన్యం) నిల్వల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, నిల్వ చేసిన ధాన్యాన్ని స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.

అనంతరం గిడ్డంగుల కార్యాలయంలో వేర్ హౌజ్ మేనేజర్ విజయతో గోదాముల తరలింపు విషయంతోపాటు చుట్టు ప్రక్కల డివిజన్ల ప్రజల ఇబ్బందులు, భారీ వాహనాల రాక పోకల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, కాలుష్యం తదితర విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. గోదాంల తరలింపు విషయాన్ని పై అధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లాలని వేర్ హౌజ్ మేనేజర్ విజయకు సూచించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. గత 1966వ సంవత్సరంలో ఈ గోదాములను ఏర్పాటు చేసినప్పుడు ఇది పట్టణ శివారు ప్రాంతంగా ఉండేదని గుర్తు చేశారు. అయితే, కాలక్రమేణా నగర విస్తరణతో ప్రస్తుతం ఈ గోదాముల చుట్టూ నివాస ప్రాంతాలు, కాలనీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. “గోదాములకు నిత్యం వచ్చే భారీ వాహనాల (లారీల) వల్ల స్థానికంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

గతంలో జరిగిన చాలా ప్రమాదాల వల్ల చాలా మంది మృతి చెందారని అన్నారు. అంతే కాకుండా, ఇక్కడి వాతావరణ కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకే ఈ గోదాములను ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు తరలించాలన్నారు. గత పది సంవత్సరాల నుండి గోదాంల తరలింపు పై స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతంలోనే డిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్‌కు గోదాంలను తరలించాలని వినతి పత్రాలు కూడ సమర్పించామని తెలిపారు. గతంలో 28 వేల మెట్రిక్ టన్నుల ప్యాడీ నిల్వలు ఉండగా ప్రస్తుతం క్రమంగా 23 వేల మెట్రిక్ టన్నులకు తగ్గిందన్నారు. అయినప్పటికీ గోదాంకు భారీ వాహానాల తాకిడి అధికంగా ఉందని.. దీంతో చుట్టు ప్రక్కల డివిజన్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.

గతంలో నగరానికి రైల్వే స్టేషన్ లేకపోవడంతో గోదాములను ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ.. ప్రస్తుత నగరానికి చక్కటి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నందున సంబంధిత గోదాములను రైల్వే స్టేషన్ సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గోదాముల తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ సమస్యను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తామని.. కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా గోదాములను వేరే చోటుకు మార్చేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుందని సునీల్ రావు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>