కలం, కరీంనగర్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల పైసలు కేంద్రమే ఇస్తున్నా, వడ్ల కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతగావడం లేదని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వానికి వివరించేందుకు ‘‘రైతు గోస బీజేపీ భరోసా’’ పేరుతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో రూ.1.39 కోట్ల రూపాయల అంచనాతో రెండో అంతస్తు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్దరణ, షెడ్ల మరమ్మతు పనులను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తి మాత్రమే..
కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు పైసలు కేంద్రానివా? రాష్ట్రానివా? సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమేనని, మధ్యవర్తిత్వం చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోందన్నారు. అయినా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమవుతోందని విమర్శించారు. ఇకనైనా బేషజాలకు పోకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.

