కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధిలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించారే తప్ప వారిపట్ల ప్రేమ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటికే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా ఈ నెలతో ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నట్లు అవుతుందని బండి అన్నారు.
ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులకు ఆరు డీఏలు ఇయ్యకుండా పెండింగ్ లో పెడితే.. ఆ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు లెక్క అని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు పోతే ప్రభుత్వానికి కష్టం అవుతుందని ఈ ఒక్క డీఏ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినప్పటికీ గ్యారంటీలు అమలయ్యాయా? మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తున్నారా? స్కూటీ ఇచ్చారా? వృద్ధులకు నెలకు 4 వేల పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ తో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురుతుందని అన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం నిధులతోపాటు రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం రూ.30 కోట్ల నిధులిచ్చిందని, అమృత్ పథకం కింద రూ.104 కోట్ల నిధులిచ్చిందని అన్నారు. ఆ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సిరిసిల్ల మున్సిపాలిటీకి నయాపైసా అయినా ఇచ్చిందా అని బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు.
Read Also: రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఆ నిధులు విడుదల
Follow Us On : WhatsApp


