కలం, వెబ్ డెస్క్: అంగన్‌వాడీ కేవలం పిల్లలకు భోజనం పెట్టే కేంద్రాలకే పరిమితం చేయకుండా పోషణతో పాటు పోషణతోపాటు ఆరోగ్యం, ప్రీస్కూల్, డిజిటల్ విద్యను అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మోదీ పాతికేళ్ల ప్రజా పాలనా సుధీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా’ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతోంది.
ఇందులో భాగంగా గురువారం కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి (Theegalaguttapally)లో బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘‘అంగన్ మిలన్ సేవా’’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 2 లక్షల అంగన్‌వాడీలను ‘సాక్షమ్ అంగన్‌వాడీ’లుగా ఆధునికీకరించే కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టిందని తెలిపారు. మోదీ 12 ఏళ్లలో అంగన్‌వాడీలు, చిన్నారుల పోషణ, గర్భిణీలు–బాలింతల పోషకాహారం కోసం ఏకంగా 1 లక్షా 77 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేసినట్లు వివరించారు.

