కలం, కరీంనగర్ బ్యూరో: కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక భారతీయ జనతా పార్టీ (BJP) విజయమే కాదు… ఇది నగర ప్రజల విజయం అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ (Karimnagar) లో శనివారం రోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఐదుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ముగ్గురు బీఆర్ఎస్ సభ్యులు కూడ మద్దతు తెలుపుతూ…చేయి ఎత్తి బలపరచడంతో ఐదు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఎన్నికలో విజయం సాధించి కో-ఆప్షన్ సభ్యులు గా ఎన్నికైన కన్న కృష్ణ, చిగిరి వెంకటమ్మ, ఎలగందుల నందకుమార్, మైనారిటీ కోటాలో బల్బీర్ సింగ్, అఫీజాబేగంలు గౌరవ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ సమక్షంలో డిప్యూటీ కమీషనర్ వేణు గెలుపు పత్రాలను అందించారు. గెలిచిన అభ్యర్థులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీకి చెందిన 34 మంది పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా…బీఆర్ఎస్ కు చెందిన మరో ముగ్గురు సభ్యులు మద్దతు ప్రకటించి ఎన్నుకోగా ఐదుగురు అభ్యర్థులలో కన్న కృష్ణ, చిగిరి వెంకటమ్మ, బర్బీర్ సింగ్ 36 ఓట్ల చొప్పన రాగా… ఎలగందుల నందకుమార్, అఫీజా బేగం కు 37 ఓట్లు రావడం జరిగింది. కో-ఆప్షన్ ఎన్నికల్లో పోటి చేయుటకు సమర్పించిన దరఖాస్తుల్లో ఆమోదించబడి మొత్తం 40 మంది అభ్యులు పోటీల్లో పాల్గొనగా 6 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ… కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో కో-ఆప్షన్ సభ్యుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. భారతీయ జనతా పార్టీ తరుపున బరిలో నిలిచిన 5 గురు కో-ఆప్షన్ సభ్యులు విజయం సాధించడంతో మా పాలకవర్గానికి మరింతబలం చేకూరిందని తెలిపారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కార్పోరేషన్ మేయర్ పీఠం దక్కడం… కో-ఆప్షన్ ఎన్నికలో కూడ బీజేపీ తన పట్టును నిరూపించుకొవడం కేవలం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తో సాధ్యమైందని కొనియాడారు. ఈ విజయంతో కార్పొరేషన్‌లో బీజేపీ బలం మరింత పెరిగినట్లయిందని… కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కరీంనగర్ నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ పాలకవర్గ సభ్యులకు నగర ప్రజల పక్షాణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో పాటు కో-ఆప్షన్ సభ్యుల సహకారం చాలా అవసరం అన్నారు. అర్హులైన వ్యక్తులను ఈ పదవులకు ఎంపిక చేయడం చాలాై సంతోషంగా ఉందన్నారు. నగర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండ మా పాలకవర్గం పని చేస్తూ… కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి బాట పట్టిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు, అదనపు కమీషనర్ సువార్త, డిప్యూటీ కమీషనర్లు వేణుమాధవ్, ఖాధర్ మొహియుద్దీన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

