కలం, నల్లగొండ : జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన “స్వీయ గణన” విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో స్వీయ గణన ప్రక్రియ 26 ఏప్రిల్ 2026 నుండి 10 మే 2026 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. జనగణనను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మొదటి విడత మే 11 నుండి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ హౌస్ సెన్సెస్ ఉంటుందని, ఫిబ్రవరి 9, 2027 నుండి ఫిబ్రవరి 28, 2027 వరకు రెండో దశ జనగణన ఉంటుందని తెలిపారు.
జనగణన ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన స్వీయ గణనలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రజలు తమ వివరాలను స్వయంగా అధికారిక వెబ్ పోర్టల్ se.census.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు 15 నుండి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని, నమోదు పూర్తయ్యాక మొబైల్ లేదా ఇమెయిల్‌కు ఒక SE ID వస్తుందని, తర్వాత దశలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ SE ID చూపిస్తే నమోదు ధృవీకరణ పూర్తవుతుందని తెలిపారు.
నల్లగొండ జిల్లాలో 5 లక్షల 3 వేల గృహాలు ఉన్నాయని, 3729 హౌసింగ్ బ్లాక్ లను, 479 సర్కిల్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీనికోసం 3179 గణకులను, 531 మంది సూపర్వైజర్లను, 41 మంది చార్జి అధికారులను నియమించినట్లు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న ఈ జనగణన పూర్తిగా డిజిటల్ స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ విడత నిర్వహించే జనగణనలో కులం వివరాలను కూడా నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు.
మరోవైపు జనగణనకు సంబంధించి అధికారులకు నాలుగు విడతల శిక్షణ నిర్వహించాల్సి ఉండగా.. ఇదివరకే రెండు విడతలు పూర్తి చేశామని, ఏప్రిల్ 27 నుండి మూడో విడత శిక్షణ ఇవ్వనున్నామని వివరించారు. స్వీయగణనపై విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, సిపిఓ శ్రీనివాస్ నాయక్, డిపిఆర్ఓ యు.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

