కలం, కరీంనగర్ బ్యూరో: భారత దేశ గతిని 12 ఏళ్ల పాలనతో మార్చేసిన మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొనియాడారు. 12 ఏళ్ల మోదీ పాలన ఒక్క అవినీతికి తావులేకుండా సుస్థిర పాలనతో భారత్ ను అగ్ర రాజ్యాల సరసన చేర్చి భారతదేశ గతినే మార్చేశారని అన్నారు. డిజిటల్ ఇండియా విషయంలో విప్తవం సృష్టించారన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలోనూ సునామీ స్రుష్టించారని చెప్పారు. సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు మోదీ అని కొనియాడారు. కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్, ఇన్సూరెన్స్, భూసార పరీక్షలతో రైతుల జీవితాలను మార్చే దిశగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.
దేశంలోకి వచ్చిన రోహింగ్యాలు, అక్రమ చొరబాటుదారులంతా 2014కు ముందు వలస వచ్చిన వాళ్లేనని చెప్పారు. మోదీ పాలనలో అక్రమ చొరబాట్లపై ఉక్కుపాదం మోపారన్నారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బంగ్లా, పాకిస్తాన్ నుండి బెంగాల్ కు అక్రమంగా వలస వచ్చిన ముస్లిం ఓట్లను తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణలోనూ నిజమైన పౌరుడి ఓట్లను తొలగించే అవకాశమే లేదన్నారు. ముస్లింలుసహా ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అక్రమ చొరబాటుదారుల ఓట్లను, దొంగ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్స్ లో నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, ఎల్ఐసీ సౌత్ జోన్ అధ్యక్షులు రాజయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు.
“చరిత్రలో ఎంతో మంది ప్రధానులు ప్రభుత్వాలను నడిపారు. టర్మ్ అయిపోగానే వెళ్లిపోయారు. కానీ దేశ దిశ దశను మార్చిన మహానాయకుడు ఎవరంటే కచ్చితంగా మోదీనే. భారత్ పేరు వింటే అభివ్రుద్ధి చెందుతున్న దేశమనే ఇన్నాళ్లు చెప్పుకున్నాం. కానీ మోదీ పాలనలో ‘‘భారత్ అభివ్రుద్ధి చెందిన దేశంగా అవతరించింది. ఆర్ధిక ప్రగతిలో 4వ స్థానానికి చేరుకుంది. నాడు ప్రపంచ దేశాలకు భారత్ అంటే చులకన. నేడు రెడ్ కార్పెట్ పరిచి మన ప్రధానికి విదేశాలకు సెల్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. 2014కు ముందు యూపీఏ పాలనంతా 2జీ స్కాం, 3జీ స్కాం, బొగ్గుసహా రోజుకో అవినీతి కుంభకోణమే. పంచభూతాలను అవినీతిమయం చేశారు. బలహీనమైన ప్రధాని. బలహీనమైన నిర్ణయాలు , విధాన నిర్ణయాల్లో శూన్యత, ప్రపంచ వేదికపై అత్యంత పరిమిత ప్రభావం భారత్ ది.
ఎన్డీఏ 12 పాలనలో పరిస్థితి పూర్తిగా మారింది. అవినీతిరహిత పాలన కొనసాగుతోంది. బలమైన ప్రధానమంత్రి ఉన్నారు. విధాన నిర్ణయాల్లో తెగువ చూపుతున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కీలక శక్తిగా భారత్ ఎదిగింది. దూరదృష్టి, ధైర్యం, మోదీ నాయకత్వమే కారణం. ప్రధాని పదవి అంటే కొన్ని కుటుంబాలకే పరిమితం అనే స్థితినుండి సామాన్యుడు కూడా ప్రధాని కావొచ్చని నిరూపించిన నేత మోదీ అని పేర్కొన్నారు. మోదీ సాధించిన విజయాలను వివరించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు……12 ఏళ్లలో 13 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేసామని తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి జరిగిన మేలును సామాన్య ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని కోరుతున్నా. మోదీ పాలనకు బహిరంగంగా మద్దతిచ్చి ఆశీర్వదించండి. ఈ దేశ భవిష్యత్తు కోసం, సుస్థిర పాలన కోసమైనా మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని మేధావులను కోరుతున్నా” అని అన్నారు.

