భగీరథ్ కేసు విచారణ.. హైకోర్టులో ఆసక్తికరంగా వాదోపవాదాలు

కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ (Bandi Bhagirath)కు సంబంధించిన పోక్సో కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టులో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు స్వరూపం, బాధితురాలి వయస్సు, విచారణ తీరు, మీడియా పాత్రపై విస్తృతంగా వాదనలు వినిపించారు. బాధితురాలు అసలు మైనరే కాదన్నారు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన పోక్సో చట్టం సెక్షన్లు వర్తించవని కోర్టుకు వివరించారు. మైనర్ కాదనడానికి ఆధారాలేంటని జస్టిస్ మాధవీదేవి ప్రశ్నించారు. అవకాశమిస్తే సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు. తగిన ఆధారాలతో కౌంటర్ వాదనలను శుక్రవారం వినిపిస్తామని బాధితురాలి తరపు న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

వేర్వేరు పుట్టిన తేదీల్లో ఏది సరైనది ?

బాధితురాలు మైనర్ కాదని లేవనెత్తిన వాదనల్లో భాగంగా ఆమె పుట్టినతేదీకి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఒక్కోదాంట్లో ఒక్కో తేదీ ఉన్నదన్నారు. ప్రస్తుతం ఈ కేసులో మరో తేదీని ప్రస్తావిస్తున్నారని, అసలు ఏ తేదీ సరైందో కోర్టే నిర్ణయించాల్సి ఉంటుందని వాదించారు. దీనికి తోడు 2021లో ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో బాధితురాలి వయసుపై ఆమె తండ్రి వెల్లడించిన వివరాలను కూడా కోర్టుకు తెలిపారు. బాధితురాలిపై నమోదైన రోడ్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో నమోదైన పుట్టిన తేదీ ప్రకారం చూస్తే ప్రస్తుతం ఆమె మేజర్‌ అని తెలిపారు. పుట్టినతేదీపై పూర్తి వివరాలను ఆధారాలతో సహా కోర్టుకు వివరించడానికి గడువు ఇవ్వాలని, శుక్రవారం విచారణ సమయానికి సమర్పిస్తామని బాధితురాలి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి తరపున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్.. పుట్టినతేదీపై పోలీసులు విచారణ జరపాలని ఆదేశించింది.

మీడియా, సోషల్ మీడియాలో ట్రయల్స్

బండి భగీరథ్ ప్రత్యేక హక్కులు కోరడం లేదని, ఈ కేసును సాధారణ కేసుల మాదిరిగా చూడరాదని హైకోర్టును నిరంజన్‌రెడ్డి కోరారు. భగీరథ్ కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ఆయన తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నారని తెలిపారు. రాజకీయ, సామాజిక ఒత్తిళ్లు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భగీరథ్‌ను దోషిగా చిత్రీకరిస్తూ వాల్ పోస్టర్లు పడ్డాయని, మెట్రో రైళ్లలో ప్రచారం జరుగుతున్నదని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం కూడా ఉన్నదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులు విచారణ పూర్తి చేయక ముందే మీడియా ట్రయల్స్ జరుగుతున్నాయని, నిందితుడిని ముందుగానే శిక్షించే ప్రయత్నం జరుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. భగీరథ్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తే విచారణకు పూర్తిగా సహకరిస్తాడని, తన వద్ద ఉన్న ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. మధ్యంతర రక్షణ ఇవ్వకపోతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉద్దేశమే దెబ్బతింటుందని, నిర్దోషిగా తన వాదనలు వినిపించుకునే అవకాశాన్ని భగీరథ్ కోల్పోతాడని కోర్టుకు వివరించారు.

‘ఇంటెరిమ్ ప్రొటెక్షన్‌’పై రేపు వెల్లడిస్తాం : హైకోర్టు

బాధితురాలు మైనర్ కాదు.. మేజర్ అనే వాదనను ఎలా నిరూపిస్తారంటూ నిందితుడి తరపు న్యాయవాదిని జస్టిస్ మాధవీదేవి ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితమే (2021లో) బాధితురాలి వయసు 15 ఏళ్లు అని, మైనర్‌గా ఉండి కారు నడుపుతూ రోడ్ యాక్సిడెంట్ చేసిన కేసులో చార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారని వివరించారు. ఆ కేసు దర్యాప్తు సందర్భంగా పేర్కొన్న పుట్టినతేదీ సరైనదే అయితే ఇప్పుడు మేజర్ అయినట్లేనని అన్నారు. పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి లేవనెత్తిన వాదనల అనంతరం భగీరథ్‌కు ‘ఇంటెరిమ్ ప్రొటెక్షన్’ (మధ్యంతర రక్షణ) కల్పించాలా లేదా అనే అంశంపై ఉత్తర్వులను శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>