కలం, వెబ్ డెస్క్: ధర్మశాలలో పంజాబ్ బ్యాటర్ల(Punjab Kings)ను ముంబై ముప్పుతిప్పలు పెట్టింది. ప్రభ్‌సిమ్రన్ మినహా మరే బ్యాటర్ రాణించలేకపోయడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సైతం సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ తర్వాత అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఒక్కడు కాస్తంత బ్యాట్ ఝులిపించాడు. మరే ఇతర బ్యాటర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే శార్దూల్ ఠాకుర్ మెరిశాడు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టి తన సత్తా చాటుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ విజయం సాధించాలంటే ఇప్పుడు 201 పరుగులు చేయాల్సి ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 22 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. ప్రభ్‌సిమ్రన్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ తడబడింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కేవలం 4 పరుగులకే శార్దూల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ వెంటనే కూపర్ కానోలీ (21), సూర్యాన్ష్ హెడ్జ్ (8), శశాంక్ సింగ్ (2) ఇలా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఒక దశలో 107/1 తో బలంగా ఉన్న పంజాబ్, 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 17 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 38 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో విష్ణు వినోద్ (15 నాటౌట్), జేవియర్ బార్ట్లెట్ (18 నాటౌట్) ధాటిగా ఆడటంతో పంజాబ్ 200 మార్కును చేరుకుంది.
ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో 39 పరుగులిచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టి పంజాబ్ నడ్డి విరిచాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు తీయగా, కోర్బిన్ , రాజ్ బావా చెరో వికెట్ సాధించారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయలేకపోయినా, 8.75 ఎకానమీతో కట్టడి చేశాడు. మరి పంజాబ్ ఇచ్చిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై బ్యాటర్లు ఎంతమేర రాణిస్తారో చూడాలి.

