కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసు (POCSO Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన బండి భగీరథ్ (Bandi Bhagirath)కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 8వ తేదీన పేట్‌బషీరాబాద్ (Petbasheerabad) పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి మంచిరేవుల టెక్ పార్క్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు నిందితుడిని నేరుగా న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన జడ్జి.. భగీరథ్‌కు రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు భారీ బందోబస్తు నడుమ నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి (Cherlapally Jail) తరలించారు.
ఈ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను కరీంనగర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు పంపడంతో పాటు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. స్టేషన్‌లో పంచుల సమక్షంలో విచారించగా భగీరథ్ (Bandi Bhagirath) తన నేరాన్ని అంగీకరించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసును కుకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ కేసులో మొదట ఉన్న సెక్షన్లను మార్చారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 64(2)(m), 74, 75 తో పాటు పోక్సో చట్టం 2012 లోని సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
Read Also: రాష్ట్రంలో భూముల విలువ పెంపుపై అంచనాలు
Follow Us On: WhatsApp

