మధిరలో సంచలనం.. వివాహిత దారుణ హత్య

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా మధిర (Madhira) మండలంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా మేడూరు గ్రామానికి చెందిన గోపిశెట్టి కల్పనగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. గోపిశెట్టి కల్పన మధిరలోని మహేంద్ర హోం ఫైనాన్స్ ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భర్తతో విభేదాలు రావడంతో మేడూరులోని నానమ్మ ఇంటి వద్ద ఉంటోంది.

శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కల్పన మేడూరు నుంచి మధిరలోని ఆఫీస్‌కు డ్యూటీ నిమిత్తం బయలుదేరింది. అయితే ఆమె ఆఫీసుకు చేరుకోకపోవడంతో.. ఫైనాన్స్ సంస్థ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో ఆమె తండ్రికి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చి, ‘మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటున్నాను.. అందుకే తీసుకెళ్తున్నాను’ అని చెప్పినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె లొకేషన్ తెలంగాణ సరిహద్దులలోని మధిర (Madhira) మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో ఉన్నట్లు చూపించింది. వెంటనే గంపలగూడెం పోలీసులు మధిర రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ​

రెండు రాష్ట్రాల పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టగా, ఓ ప్రైవేట్ వెంచర్ వద్ద కల్పన రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం, నిందితులు ఆమె కేకలు వేయకుండా చున్నీతో నోటిని బిగించి, తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

​మధిర రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ సహాయంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ హత్య వెనుక ఉన్నది ఎవరు? మనస్పర్థల కారణంగా భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? లేక తండ్రికి ఫోన్ చేసిన ఆ ‘ప్రేమికుడు’ అని చెప్పుకునే వ్యక్తి హస్తం ఉందా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణాలలో మధిర రూరల్ సీఐ డి. మధు, రూరల్ ఎస్సై బి. లక్ష్మీ భార్గవి కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: ‘పెద్ది’ మూవీ రన్‌టైమ్‌పై కీలక అప్‌డేట్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>