కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ టెస్టు జట్టులో పెద్ద మార్పు జరిగింది. షాన్ మసూద్‌ను టెస్టు కెప్టెన్ పదవి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తప్పించింది. అతని స్థానంలో బాబర్ అజామ్ (Babar Azam) ను మళ్లీ కెప్టెన్‌గా నియమించింది. 2023 చివర్లో మసూద్ కెప్టెన్ అయ్యాడు. అతని నాయకత్వంలో పాకిస్థాన్ 16 టెస్టులు ఆడింది. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.
మిగిలిన 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో 3-0తో సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో 2-0తో ఓడింది. ఇంగ్లాండ్‌పై 2-1తో గెలవడం మాత్రమే అతని కెప్టెన్సీలో వచ్చిన సిరీస్ విజయం. ప్రధాన సెలెక్టర్ ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ, జట్టుకు మెరుగైన ఫలితాలు అందించే నాయకుడు అవసరమని సెలక్షన్ కమిటీ భావించినట్లు తెలిపారు.
అందుకే చర్చల తర్వాత బాబర్ అజామ్ పేరునే ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. బాబర్ తొలి కెప్టెన్సీలో పాకిస్థాన్ 20 టెస్టుల్లో 10 విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికాపై స్వదేశంలో సిరీస్ గెలిచింది. బంగ్లాదేశ్, శ్రీలంక పర్యటనల్లో కూడా క్లీన్‌స్వీప్ చేసింది. బాబర్ రెండోసారి కెప్టెన్‌గా ఈ నెల చివర్లో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో జట్టును నడిపించనున్నాడు. కాగా, షాన్ మసూద్‌కు కూడా ఆ సిరీస్‌కు ప్రకటించిన జట్టులో స్థానం దక్కింది.

