కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలోని భగత్‌నగర్, రామచంద్రపూర్ కాలనీల్లో ఆదివారం పెద్దమ్మ తల్లి బోనాల (Peddamma Bonalu) మహోత్సవాలు వైభవంగా జరిగాయి. భగత్‌నగర్‌లోని పట్టణ ముదిరాజ్ సంఘం, అలాగే రామచంద్రపూర్ కాలనీలోని హస్నాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల మహోత్సవంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి, తలపై బోనాలతో ర్యాలీగా పెద్దమ్మ తల్లి దేవాలయానికి బయలుదేరారు. డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ జాతర అంగరంగ వైభవంగా సాగింది.
కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు స్వయంగా నెత్తిన బోనమెత్తి మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం భగత్ నగర్ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని, రామచంద్రపూర్ కాలనీ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… ప్రతి ఏటా నగరంలో పట్టణ ముదిరాజ్ సంఘం, రామచంద్రపూర్ కాలనీలోని హస్నాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతుందని తెలిపారు. నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. పెద్దమ్మ తల్లి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ నగర ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, 43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి మొండయ్య గౌడ్, 41వ డివిజన్ కార్పొరేటర్ నాంపల్లి రేణుక శ్రీనివాస్,భగత్ నగర్, హస్నాపూర్ ముదిరాజ్ సంఘ పెద్దలు కొలకాని నర్సయ్య, పండుగ నాగరాజు, ఏండ్ర శ్రీనివాస్, జెట్టి బాలయ్య, కుంభం మల్లయ్య, మ్యాకల తిరుపతి, జడిగాల రాజయ్య, ఇట్టవేణి భద్రయ్య, కుంభం అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

