కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు నిరంతరం ఆడే అవకాశం కల్పిస్తూ, నగరంలో సరికొత్తగా ‘హైదరాబాద్ యూత్ లీగ్’ (Hyderabad Youth League) ప్రారంభమైంది. వివిధ అకాడమీలు, క్లబ్‌లు, విద్యా సంస్థలకు చెందిన యువ క్రీడాకారులకు ఏడాది పొడవునా ఒక క్రమబద్ధమైన పోటీ వేదికను అందించడమే లక్ష్యంగా ఈ లీగ్‌ను తీసుకొచ్చారు. నగరంలో ఫుట్‌బాల్ రంగంలో ఎంతో గుర్తింపు పొందిన హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్, హైదరాబాద్ సూపర్ లీగ్, హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీలు సంయుక్తంగా కలిసి ఈ సరికొత్త లీగ్‌కు శ్రీకారం చుట్టాయి.
ఒక పటిష్టమైన, స్థిరమైన పోటీల నిర్మాణం ద్వారా హైదరాబాద్‌లోని యూత్ ఫుట్‌బాల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ లీగ్ ప్రతి ఏటా ఆగస్టు నుండి మే నెల వరకు ఛాంపియన్షిప్ మోడల్లో కొనసాగుతుంది. ఇందులో అండర్-8, అండర్-10, అండర్-13, అండర్-16, అండర్-18 వయసు విభాగాల వారీగా పోటీలు నిర్వహిస్తారు. ఎక్కడో ఒకచోట జరిగే ఒంటరి టోర్నమెంట్ల కోసం కాకుండా, ఆటగాళ్లు ఒక పూర్తి సీజన్ అంతా ఆడుతూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఈ క్యాలెండర్‌ను రూపొందించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ యూత్ లీగ్ కో-ఫౌండర్ ఫైజ్ ఖాన్ మాట్లాడుతూ.. యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు క్రమబద్ధంగా పోటీ పడుతూ, ఏడాది పొడవునా రాణించడానికి హైదరాబాద్‌కు ఇలాంటి ఒక వేదిక ఎప్పటి నుంచో అవసరమని పేర్కొన్నారు. ఈ లీగ్ ఆ ప్రయాణానికి తొలి అడుగని ఆయన అన్నారు. ప్రతి అకాడమీ, క్లబ్, పాఠశాలలకు అర్ధవంతమైన పోటీని అందిస్తూ, క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడటం ద్వారా ప్రతి యువ ఆటగాడు తమ ప్రతిభను మెరుగుపరుచుకునేలా ఒక స్థిరమైన వాతావారణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ లీగ్ యొక్క మొదటి సీజన్ రాబోయే ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, పోటీల పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

