కలం, కరీంనగర్ బ్యూరో: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆటో కార్మికులు సమ్మె బాట పట్టారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ (Auto Strike) చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్త ఆటో బంద్‌లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి ఆటోలు నిలిచివేస్తున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 40 వేల వరకు ఆటోలు ఉండగా అందులో కరీంనగర్ జిల్లాలో సుమారు 16 వేల వరకు ఉన్నాయి. నగరంలోని 4 వేల ఆటోలతో పాటు మరో 3 నుంచి 4 వేల ఆటోలు పరిసర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రయాణికులను, విద్యార్థులను తరలించడంతో పాటు వేల సంఖ్యలో ఆటోలు తిరుగుతుంటాయి.
ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి నిలిచిపోనుండటంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు వెళ్లని గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. డ్రైవర్లు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్లలో ప్రభుత్వం ఇస్తానన్న రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే అందించాలి. బోర్డుకు తోడుగా ప్రమాద బీమా కల్పించాలన్నారు. డ్రైవర్ల రక్షణకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలి. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను, ర్యాపిడో, ఓలా, ఉబర్ సేవలను రద్దు చేయాలి. ఈ డిమాండ్ల పరిష్కరించే వరకు బంద్ కొనసాగుతుందని కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

