కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు (Velichala Rajender Rao) మరో అడుగు ముందుకేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుని గృహప్రవేశం చేసుకునే ఆడబిడ్డలకు తనవంతు సహాయంగా ఇండక్షన్ (ఎలక్ట్రిక్) స్టవ్ లేదా బోళ్ళ సెట్ అందజేస్తానని ప్రకటించారు. ఈ వినూత్న కార్యక్రమానికి కరీంనగర్ నియోజకవర్గంలోని చామనపల్లి నుంచి శ్రీకారం చుట్టారు.
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో పల్లె జగదీష్ – శిరీష దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆదివారం వెలిచాల రాజేందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన గృహంలోకి అడుగుపెడుతున్న దంపతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబం సొంతింటి గడప తొక్కుతున్న సందర్భం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. మొట్టమొదటిసారిగా ఈ దంపతులకు ఇండక్షన్ స్టవ్‌తో పాటు బోళ్ల సెట్‌ను అందజేస్తానని పేర్కొన్నారు.
సొంతింటి కలకు ప్రభుత్వ భరోసా..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని రాజేందర్‌రావు తెలిపారు. మొదటి విడతలో నాలుగు లక్షల ఇళ్లకు మంజూరు చేయగా, ఇప్పటికే పెద్ద సంఖ్యలో నిర్మాణాలు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. రెండో విడతలో మరో రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయంతో పేదలకు సొంతింటి కలను నిజం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేకుల షెడ్లు వేసుకుని లేదా గోడల వరకు నిర్మాణం పూర్తిచేసుకుని ఇబ్బందులు పడుతున్న అర్హులైన కుటుంబాలకు కూడా పథకం కింద రూ.2 లక్షల వరకు ప్రభుత్వ సహాయం అందించే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి వారు తమ గ్రామ సర్పంచ్‌ను సంప్రదించి వివరాలు అందించాలని సూచించారు.
గృహప్రవేశం వేళ.. ఓ చిన్న కానుక..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయి గృహప్రవేశం చేసుకునే ప్రతి ఆడబిడ్డ ఇంట్లో ఆనందం మరింత రెట్టింపు కావాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాజేందర్‌రావు తెలిపారు. ప్రభుత్వం సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత తీసుకుంటే.. ఆ ఇంట్లో తొలి అడుగు వేసే కుటుంబంతో తనవంతుగా ఆనందాన్ని పంచుకోవాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. చామనపల్లి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం కరీంనగర్ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
పద్మశాలీ సంఘ భవనానికి సహకారం..
చామనపల్లిలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో రాజేందర్‌రావును ఘనంగా సన్మానించారు. సంఘ భవన నిర్మాణానికి తనవంతు సహాయం అందించడంతో పాటు, ప్రభుత్వ పరంగా అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలోనూ రాజేందర్‌రావు పాల్గొన్నారు. గౌడ కులస్తుల అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
నెలలోపు ఇల్లు పూర్తి చేసే బాధ్యత..
ఇరుకుల్ల గ్రామంలో విజయలక్ష్మి–రామ్‌రెడ్డి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాజేందర్‌రావు భూమిపూజ చేశారు. ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేసి నెలలోపు పనులు పూర్తయ్యేలా చూస్తానని, నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు అందేలా అధికారులతో సమన్వయం చేస్తానని తెలిపారు. అనంతరం ఇరుకుల్లలో కురుమ సంఘం సభ్యులతో కలిసి బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, చామనపల్లి సర్పంచ్ బోగొండ ఐలయ్య, భాష వేణి మల్లేశం, మోతె ప్రశాంత్‌రెడ్డి, గుర్రం తిరుపతిరెడ్డి, కమల్‌గౌడ్, కార్పొరేటర్ గుమ్మడి రాజ్‌కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మీసాల శంకర్, జగ్గాని కనకయ్య, కాంగ్రెస్ నాయకులు మూల కృష్ణారెడ్డి అనంతుల రమేష్, పోరండ్ల రమేష్, ఉప సర్పంచ్ గాలిపల్లి రవి, కస్తూరి అశోక్ రెడ్డి,పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం మల్లేశం, దాసరి ఆంజనేయులు, భూర్ల లక్ష్మీరాజం, దికొండ శంకరయ్య, గాజంగి రమేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

