కలం, వెబ్ డెస్క్: మాకే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓటమి పాలైంది. మిచెల్ స్టార్క్ 10 వికెట్లతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో బంగ్లాదేశ్ పాయింట్ల శాతంలో భారీ కోత పడటంతో, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC ) పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత జట్టుకు నాలుగో స్థానానికి చేరే సువర్ణావకాశం దక్కింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించి ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించింది.
అయితే రెండో టెస్టులో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో బంగ్లాదేశ్ పాయింట్ల శాతం (పిసిటి) 66.67 నుంచి 55.56కు పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఆరు మ్యాచుల్లో మూడు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో 50 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో భారత్ 10 మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రాతో 64 పాయింట్లు, 53.33 పాయింట్ల శాతంతో భారత్ ఐదో స్థానంలో ఉంది.
ఇప్పుడు కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో విజయం సాధిస్తే భారత్, బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంటుంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 96 పాయింట్లు, 80 పిసిటితో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా 75 పిసిటితో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 72.22 పిసిటితో మూడో స్థానంలో ఉన్నాయి. శ్రీలంక 33.33 పిసిటితో ఆరో స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే వరుసగా విజయాలు సాధించాల్సి ఉంది. మరోవైపు, రెండో టెస్టులో ఓడిపోయినప్పటికీ బంగ్లాదేశ్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. ఇది ఆ జట్టు చరిత్రలోనే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ర్యాంకింగ్స్‌పై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో స్పందిస్తూ, ఆరో స్థానానికి చేరడం చాలా పెద్ద సాధన అని సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చామని, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో అగ్రశ్రేణి జట్టుతో పోటీపడటం సులభం కాదని పేర్కొన్నారు. తమ జట్టులోని 90 శాతం మంది ఆటగాళ్లకు ఇక్కడ ఆడిన అనుభవం లేదని, అందుకే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకపోయారని చెప్పారు. ప్రతి 23 ఏళ్లకు ఒకసారి కాకుండా తమకు ఆస్ట్రేలియాలో క్రమం తప్పకుండా ఆడే అవకాశాలు కల్పించాలని క్రికెట్ బోర్డులను శాంటో కోరారు.

