కలం, చండూరు: చండూరు (Chandur) వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని గోదాము నుంచి సుమారు రూ.23 లక్షల విలువైన 840 క్వింటాళ్ల ధాన్యం మాయమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నకిలీ తాళం చెవితో గోదాము తెరిచిన కేటుగాళ్ళు ధాన్యాన్ని చోరీ చేసి, చట్టుపక్కల ఎవరికీ అనుమానం రాకుండా సూర్యపేటలో విక్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా చిరు వ్యాపారం చేసే ఆంజనేయులు అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
అయితే ఈ విషయం ముందే పసిగట్టిన కొందరు స్థానిక నాయకులు, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అతడిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.5 లక్షలు వసూలు చేశారు. అనంతరం ఆ డబ్బుల పంపిణీ వ్యవహారంలో నాయకుల మధ్య తేడాలు రావడంతో ఈ చోరీ భాగోతం కాస్త బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపి, ధాన్యం చోరీకి పాల్పడిన ఆంజనేయులుతో పాటు, అతడిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన స్థానిక నాయకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

