కలం, వెబ్ డెస్క్: ఆగ్రాలో సూట్ కేసులో లభ్యమైన మహిళ మృతదేహం కేసు (Woman Murder Case)లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందు పోలీసులకు ఆగ్రా (Agra) రైల్వే స్టేషన్లో సూట్ కేసులో కేవలం మహిళ మొండెం మాత్రమే దొరికింది. అయితే కేసు దర్యాప్తు చేయగా మహిళ హత్యకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సదరు మహిళను చెన్నై (Chennai)లో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను చంపిన కిరాతకులు ఏకంగా ఆమె శరీర భాగాలతో బిర్యానీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను పరిశీలిస్తే..
ఆగస్ట్ 5న ఓ వ్యక్తి సూట్ కేసుతో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. తర్వాత సూట్ కేసును రైలులో వదిలిపెట్టి దిగేశాడు. రైలు ఆగ్రా చేరుకున్న తర్వాత జనరల్ బోగీలో ఉన్న సూట్‌కేసు నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అందులో మృతి చెందిన మహిళ శరీర భాగాలు ఉండటం చూసి అందరూ షాకయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఆ సూట్ కేసులో ఒక కవర్‌పై చెన్నై అని రాసి ఉండటం చూసి, ఆ సూట్‌కేస్ చెన్నై నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆగ్రా పోలీసులు వెంటనే తమిళనాడు పోలీసులను సంప్రదించారు.
ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ఏకంగా 350కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించి ఓ మహిళ, మరో పురుషుడు కలిసి సూట్ కేసుతో స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు. వీరిద్దరూ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో సూట్‌కేసు పెట్టి ఆ తర్వాత చెన్నై పార్క్ రైల్వేస్టేషన్ నుంచి సబర్బన్ రైలు ఎక్కి గూడువాంజేరికి వెళ్లినట్లు గుర్తించారు. అదే వ్యక్తులు సూట్‌కేస్‌తో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న సీసీ టీవీ ఫుటేజ్ చూసి పోలీసులు వారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ వాళ్ల ఇంట్లో ఉన్న పరిస్థితులు చూపి పోలీసులు షాకయ్యారు. ఆ ఇంట్లోనే మహిళ హత్య జరిగినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అంతే కాకుండా ఇంట్లో ఉన్న ఓ బిర్యానీ పాత్రలో మానవ శరీరానికి చెందిన ముక్కలు ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది.
దీంతో మహిళను చంపి కొన్ని భాగాలతో బిర్యానీ వండి, మరికొన్ని భాగాలను సూట్‌కేసులో ఆగ్రాకు పంపినట్లు గుర్తించారు. మృతురాలు ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా గుర్తించారు. ఆమె భర్త నుంచి విడిపోయి చెన్నైలో ఉంటోంది. అక్కడే మహిళను హత్య చేసిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ కూడా నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్లు నిషాకు బంధువులేనని పోలీసులు తెలిపారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. నిందితులను పట్టుకొని, విచారణ చేపట్టి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

