కలం, వెబ్ డెస్క్: ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం (Markapuram Bus Accident) లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. స్పాట్ లోనే 10 మంది చనిపోయారు. సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో మరో ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన వారిలో పెదారికట్లకు చెందిన అంబటి అనిల్, చిన్నారి అంబటి లియో(5 నెలలు) ఉన్నారు. కనిగిరి మండలం చల్లగిరిగలకు చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, తింగారెడ్డిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి, బత్తుల పద్మ, దాసరిపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు, పొదిలి మండలం ఉన్నగురువాయపాలెం వాసులు నర్సింగ్ ప్రభావతి, నర్సింగ్ క్షేత్ర, పనుగోడుకు చెందిన దేవాండ్ల రామయ్య, బుచ్చి మండలం మంగళకట్టకు చెందిన జయరామయ్య ఉన్నట్లు తెలుస్తోంది. 28 మందికి గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
రోడ్డు ప్రమాదంపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
మార్కాపురం ఘోర అగ్ని ప్రమాదంపై అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు: 6304285613, 9985733999, 7989537285, 9703578434. అటు రోడ్డు ప్రమాదస్థలిలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించారు. ఘటనాస్థలి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు సేకరించారు.
మార్కాపురం ఘోర ప్రమాదంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. అటు ఈ ప్రమాదంపై ఉపముఖ్యమంత్రి పవన్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హోం మంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల, ఆనం, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, డీఎస్‌బీవీ స్వామి పల్లా శ్రీనివాసరావు. గొట్టిపాటి, మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మార్కాపురం ప్రమాదం పట్ల ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఏపీ అధికారులతో మాట్లాడాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించారు.

