కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australia Cricket Team) సంచలన నిర్ణయం తీసుకుంది. 138 ఏళ్ల తర్వాత ఇటువంటి నిర్ణయం మళ్ళీ తీసుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు (Australia Cricket Team) ఈ అరుదైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్పిన్‌కు అనుకూలంగా పేరున్న సిడ్నీ పిచ్‌పై స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగింది. 1888 తర్వాత అంటే 138 ఏళ్ల విరామం అనంతరం సిడ్నీలో స్పిన్నర్ లేకుండా ఆస్ట్రేలియా టెస్ట్ ఆడటం ఇదే తొలిసారి.
ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకోగా ఆ జట్టు 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జో రూట్ హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి స్కోర్‌ను 200 పరుగుల దాటించారు. ప్రస్తుతం ఇద్దరూ సెంచరీల దిశగా నిలకడగా ఆడుతున్నారు. స్పిన్నర్ లేకుండా ఆస్ట్రేలియా బరిలోకి దిగిన ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది.


