కలం, వెబ్ డెస్క్: ఏపీలో రైతు సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchennaidu) స్పష్టం చేశారు. ఏరువాక పూర్ణిమ సందర్భంగా గుంటూరులో ‘ఏరువాక’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెండేళ్లలో వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టామని.. ఖరీఫ్ సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు అన్నదాతలకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచామని అన్నారు. ఎరువులు, విత్తనాల విషయంలో అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎల్ నీనో వంటి సవాళ్లను సైతం ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
వ్యవసాయమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని.. రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మళ్లీ అగ్రపథాన నిలుపుతామని వ్యాఖ్యానించారు. గత వైసీపీ (YSRCP) హయాంలో వ్యవసాయ రంగానికి కనీస సహకారం కూడా అందలేదని మండిపడ్డారు. విత్తన కంపెనీలకు భారీ బకాయిలు పెట్టి వ్యవస్థను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు రాజధాని రైతులు, మహిళల్ని వేధించి బూతులు తిట్టి కాళ్లతో తన్నిన వారికి రాజధానిలో తిరిగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని బిల్లుకు గొడ్డలి పార్టీ మినహా అన్ని పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. పార్లమెంట్ లో వ్యతిరేకించి అమరావతిలో ఎలా పర్యటిస్తారని నిలదీశారు.

