కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తెలిపారు. మహబూబ్ నగర్ (Mahabubnagar) లోని విద్యుత్ సౌధ, మెట్టుగడ్డలో రూ. 52.56 లక్షల వ్యయంతో నిర్మించనున్న విజిలెన్స్ & ఏపీటీఎస్పీ ఎస్ భవన నిర్మాణ పనులకు సీఎండీ జితేష్ వి. పాటిల్‌తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
ముఖ్యమంత్రి విజన్‌కు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, పవర్ నెట్వర్క్ స్థిరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. ఐటీ పార్క్ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు స్థాపించబడుతున్నాయని, ముఖ్యంగా అమరరాజ కంపెనీ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు అవుతుందని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హన్వాడ మండలం గొండ్యాల గ్రామంలో 133 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు భూములను గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు త్వరలో ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని 33/11 కేవీ సబ్స్టేషన్లు పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ పరిసర హైవేలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చాయని, గత రెండున్నర సంవత్సరాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, ఆధునిక సాంకేతికతతో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. మెడికల్ కాలేజ్ సమీపంలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ త్వరలో ప్రారంభం కానుందని, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో కూడా విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుకు యూనివర్సిటీలో సబ్ స్టేషన్ నిర్మాణానికి యూనివర్సిటీ వారితో మాట్లాడి స్థలం కేటాయించుకుని, శంకుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు విద్యుత్తు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన (Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, ఎస్ఈ జి. భీమానాయక్, కార్పొరేటర్లు జ్యోతి, విట్టల్ రెడ్డి, తిరుమల వెంకటేష్, రమేష్ రెడ్డి, మేగ్యా నాయక్, ప్రశాంత్, తాహెర్, నాయకులు జాజిమొగ్గ నర్సింహులు, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On : WhatsApp

