ఆంధ్రప్రదేశ్ కర్నూలు(Kurnool)లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… కావేరీ ట్రావెల్స్ బస్సు (DD 01 AN 9190) బెంగుళూరు నుండి హైదరాబాద్ వెళుతోంది. ఈ క్రమంలో బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్దకు రాగానే ప్రధాన రహదారిపై బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న 25 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. బస్సు కింద మరో ద్విచక్ర వాహనం చిక్కుకున్నట్టు సమాచారం. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 42 మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సీఎం తీవ్ర దిగ్భ్రాంతి…
కర్నూలు(Kurnool) జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు(Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ప్రమాద ఘటనపై దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న సీఎం.. పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
Read Also: ఇద్దరు పిల్లల నిబంధన రద్దు.. ఆమోదం తెలిపిన క్యాబినెట్

